ఊహలు గుసగుసలాడే అంటూ తెలుగువారికి దగ్గరైన నార్త్ బ్యూటీ రాశీఖన్నా ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఆమె నటించిన వెబ్ సీరీస్‌లు రెండు టాప్ పొజిషన్‌లో ఉన్నాయి. ఈ ఘనత తనకు మాత్రమే దక్కిందంటూ హ్యాపీగా కనిపిస్తున్నారు రాశీఖన్నా. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ షేర్ చేసుకున్నారు.
రాశీఖన్నా నటించిన సీరీస్ ఫర్జి. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన ఈ సీరీస్‌కి యమా స్పందన వచ్చింది. ఫ్యామిలీమేన్ సీరీస్ తెరకెక్కించిన రాజ్, డీకే తెరకెక్కించారు. మోస్ట్ వాచ్డ్ ఇండియన్ ఒరిజినల్ సీరీస్‌గా ఫర్జికి పేరొచ్చింది. అది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
రెండో స్థానంలో రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ ఉంది. ఇందులో కూడా రాశీఖన్నా కీ రోల్ చేశారు. అజయ్ దేవ్‌గణ్ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ రుద్ర. రాశీ నటనకు ఫిదా అయ్యారు నెటిజన్లు. ఆమె పాత్రకు ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు రికార్డుల వేటలోనూ దూసుకుపోతోంది రుద్ర.
ఫర్జి నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది. రెండో స్థానాన్ని రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్ ఆక్రమించింది. మీర్జాపూర్ సీజన్2, పంచాయత్ సీజన్2, క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్, ఆదిత్య రాయ్ కపూర్ సరికొత్త సీరీస్ ది నైట్ మేనేజర్, ది ఫ్యామిలీ మేన్ సీజన్2 కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు రాశీఖన్నా. యోధలో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తున్నారు. ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అది. ప్లాట్‌ఫార్మ్ ఏదైనా,భాష ఏదైనా స్క్రిప్ట్ పక్కాగా ఉంటే, నటించడానికి తాను సిద్ధమేనని అంటున్నారు రాశీఖన్నా.
"మొదటి నుంచి కేవలం నన్ను నేను నమ్ముకున్నాను. నేను ఎప్పుడూ ఇతరులతో పోటీ పడలేదు. నా దగ్గరకు వచ్చిన స్క్రిప్టులను జాగ్రత్తగా అర్థం చేసుకుని నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. అదే నాకు శ్రీరామరక్ష అయింది. నేను భాగమైన సీరీస్‌లు ఇలా గొప్ప గుర్తింపు పొందుతుంటే చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు రాశీఖన్నా. ఎప్పుడూ వైవిధ్యమైన ఫొటోషూట్లతో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు ఈ బ్యూటీ.